నటీనటులు చాలా అదృష్టవంతులు. వాళ్ల జీవితాలను వాళ్లు జీవిస్తూనే, జీవితంలో ఎక్కడా పరిచయం కూడా లేని వాళ్ల జీవితాలను పోషించే అవకాశం దక్కించుకుంటారు. అలాంటి లైఫ్ నాకు పరిచయం లేకపోతే చాలా బోర్ కొట్టేది. సారా అనే ఒకే ఒక లైఫ్‌ని లీడ్ చేయాల్సి వచ్చేది. ఆ ఊహే నాకు నచ్చడం లేదు అని అంటున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్. కేదార్‌నాథ్, సింబా, లవ్ ఆజ్ కల్, అత్రంగి రే వంటి సినిమాల్లో నటించారు సారా అలీ ఖాన్. ఆమె నటించిన గ్యాస్ లైట్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుదలకు అన్నీ సిద్ధమయ్యాయి.
ఈ సినిమాలో కంటెంట్ చూసి ఆడియన్స్ ఎలా ఫీలవుతారో తెలుసుకోవాలని ఉందని అంటున్నారు సారా అలీఖాన్. ఆమె నటిగా ఇండస్ట్రీలో ఎంటర్ అయి ఐదేళ్లయింది. దీని గురించి సారా అలీఖాన్ మాట్లాడారు. ``నా కెరీర్ పరంగా నాకు సలహాలు ఇవ్వండి. నేను కూడా అంత తేలిగ్గా ప్రాజెక్టులకు సంతకాలు చేయను. నేను కన్విన్స్ అయితేనే సైన్ చేస్తాను. ఒకప్పుడు కన్విన్స్ కాకపోయినా సినిమాలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా ఆలోచనా విధానం మారింది. నాకు నా సమయం చాలా ముఖ్యం. పనిలో ఉన్నా, పని లేకుండా ఉన్నా నా టైమ్‌ని నేను చాలా బాగా ప్లాన్ చేసుకుంటా. సినిమా విడుదలయ్యే శుక్రవారం రోజు ఎంత నిబద్ధతగా, భయభక్తులతో ఉంటానో, సెట్లో ఉన్న సోమవారం, బుధవారం కూడా అంతే నిబద్ధతతో ఉంటాను. నేను కేవలం సరదాగా సినిమాలు చేయడం లేదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాను.
అర్థం చేసుకుంటున్నాను. నటిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలన్న ఆకలి మీద ఉన్నాను. నాకు కనీసం పరిచయం కూడా లేని వ్యక్తుల పేర్లతో, వారి కేరక్టర్లలో జీవిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నన్ను అన్నీ జోనర్ల సినిమాలలోనూ ప్రజలు ఆదరించాలనే కోరిక ఉంది. మరీ ముఖ్యంగా కామెడీ సినిమాలు చేయాలన్నది నా చిరకాల వాంఛ. కామెడీ చేయడం కష్టమని చాలా మంది అంటారు. అది నిజమేనేమో, అయినా నాకు చేయాలని ఉంది`` అని అన్నారు. బిగ్ స్క్రీన్‌లో విడుదలైనా, డిజిటల్‌లో విడుదలైనా జనాలకు సినిమా చేరువ కావాలన్నది మాత్రమే తన లక్ష్యమని చెప్పారు సారా.